అక్షయ తృతీయ: ఈ దానాలు చేస్తే మీకు డబ్బే డబ్బు..

Akshaya Tritiya: హిందూ సంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటిగా చెప్పుకుంటారు. ‘అక్షయ’ అంటే క్షయించని లేదా ఎప్పటికీ తగ్గని అని అర్థం. ఈ రోజున చేసిన పుణ్యకార్యాలు, దానాలు, జపాలు ఎన్నటికీ తగ్గకుండా ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి రోజున ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించడానికి ప్రత్యేకమైన ముహూర్తం అవసరం లేకుండా అత్యంత శుభముగా పరిగణిస్తారు. అయితే ఈరోజు ఏం చేయాలి? ఎలాంటి దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు?
అక్షయ తృతీయ పవిత్ర దినాన స్నానం, జపం, హోమం వంటి ఆధ్యాత్మిక కార్యాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తెల్లవారుజామున పవిత్ర నదుల్లో లేదా ఇంట్లోనే శుచిగా స్నానం చేసి, దేవుడిని ప్రార్థించడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది. విష్ణు, లక్ష్మీ దేవులను ఆరాధించడం ఈ రోజున ప్రత్యేకంగా చేయబడుతుంది. అలాగే గాయత్రీ మంత్రం, విష్ణు సహస్రనామం వంటి జపాలు చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలను పొందుతారు.
అక్షయ తృతీయ రోజున దానం చేయడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎండ తీవ్రంగా ఉన్న ఈ కాలంలో పేదలకు ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయడం గొప్ప పుణ్యకార్యంగా భావించబడుతుంది. బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, పానీయాలు వంటి వాటిని అందించడం ద్వారా మనిషి కేవలం పుణ్యాన్ని సంపాదించడమే కాకుండా మానవతా విలువలను కూడా నిలబెడతాడు. అదేవిధంగా నవధాన్యాలు దానం చేయడం వల్ల సంపద, సౌభాగ్యం పెరుగుతాయని నమ్మకం.
ఈ రోజున నీటి కుండ (మట్టికుండ) దానం చేయడం ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వేసవి కాలంలో దాహార్తిని తీర్చే నీరు అత్యంత విలువైనది. అందువల్ల నీటిని నిల్వ చేసుకునే కుండలను దానం చేయడం ద్వారా ‘జలదానం’ చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది శారీరకంగా ఇతరులకు ఉపకారం చేయడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మహత్తరమైన ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
అక్షయ తృతీయ అనేది సంపద, శాంతి, సౌఖ్యాలను ప్రసాదించే పవిత్ర దినం. ఈ రోజున చిన్నచిన్న పుణ్యకార్యాలు చేసినా అవి ఎన్నటికీ తగ్గకుండా ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగ్గట్టు దానం, ధర్మం చేస్తూ ఈ పవిత్ర దినాన్ని సార్థకం చేసుకోవాలి.
0
0
0
0
0
0
0