రాత్రి సమయంలో బ్రష్ చేసుకోకపోతే ఏం జరగుతుందంటే..

Night Brushing Benefits: రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయాలని ఇప్పటికే చాలా మంది ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే రాత్రి సమయంలో బ్రష్ చేసుకోకపోతే అనేక దంత సమస్యలు ఎదురవుతున్నట్లు కొందరు వైద్యుల వద్ద వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు డెంటల్ నిపుణుల ప్రకారం రాత్రి నిద్రపోయేమందు బ్రష్ చేయడం వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది. రోజంతా మనం తినే ఆహారం, ముఖ్యంగా చక్కెర పదార్థాలు, దంతాలపై పలుచని పొరలా పేరుకుపోతాయి. దీనిని ప్లాక్ (Plaque) అంటారు. ఈ ప్లాక్‌లో బాక్టీరియా వేగంగా పెరిగి, దంతాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇంకా ఏమేం జరుగుతాయంటే?
రాత్రి సమయంలో బ్రష్ చేయకపోవడం వల్ల లాలాజలం (saliva) ఉత్పత్తి తగ్గిపోతుంది. లాలాజలం సహజంగా నోటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి అది తక్కువగా ఉండటంతో, బ్రష్ చేయకుండా నిద్రపోతే బాక్టీరియా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బాక్టీరియా చక్కెరను ఆమ్లాలుగా మార్చి దంతాల ఎనామెల్‌ను క్రమంగా క్షీణింపజేస్తాయి. దీని వల్ల కేవిటీస్ (దంతాలలో రంధ్రాలు) ఏర్పడతాయి.
అదే విధంగా బ్రష్ చేయకపోవడం వల్ల చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. ప్లాక్ క్రమంగా గట్టిపడి టార్టర్గా మారుతుంది. ఇది చిగుళ్లలో వాపు, రక్తస్రావం, చివరికి గమ్ డిసీజ్ (Gum Disease)కు దారి తీస్తుంది. ఈ పరిస్థితి తీవ్రంగా మారితే దంతాలు కూడా ఊడిపోవచ్చు. నోటి దుర్వాసన (Bad Breath) కూడా పెరుగుతుంది. రాత్రంతా బాక్టీరియా పెరిగి, ఉదయం లేచినప్పుడు నోటి నుంచి అసహ్యకరమైన వాసన వస్తుంది. ఇది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అందువల్ల రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 నిమిషాలు సమయం తీసుకుని సరిగా బ్రష్ చేయాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ వాడటం మంచిది. అలాగే నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం, అవసరమైతే ఫ్లాస్ వాడటం ద్వారా దంతాల మధ్యలో ఉన్న ఆహార కణాలను తొలగించవచ్చు. ఈ చిన్న అలవాట్లు పాటిస్తే దంతాలు బలంగా ఉండటమే కాకుండా, నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇదిలా ఉండగా దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు గట్టిపడుతాయి. మనం తినే పదార్థాలు నేరుగా దంతాల బలం, చిగుళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాల్షియం (Calcium) అధికంగా ఉండే ఆహారం దంతాల బలం కోసం అవసరం. పాలు, పెరుగు, పనీర్ వంటి పాల పదార్థాలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి దంతాల ఎనామెల్‌ను బలంగా ఉంచి, క్షీణతను నివారించడంలో సహాయపడతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి అవసరం.
విటమిన్ D కూడా కాల్షియం శరీరంలో సరిగ్గా శోషించడానికి అవసరం. సూర్యరశ్మి ద్వారా ఇది సహజంగా లభిస్తుంది. అలాగే గుడ్లు, చేపలు వంటి ఆహారాల్లో కూడా విటమిన్ D ఉంటుంది. ఈ పోషకం లేకపోతే కాల్షియం ఉన్నా దంతాలకు పూర్తి ప్రయోజనం ఉండదు.
దంతాల కోసం ఫాస్ఫరస్ (Phosphorus) కూడా ముఖ్యమైన ఖనిజం. ఇది కాల్షియంతో కలిసి పనిచేసి దంతాలను మరింత బలంగా చేస్తుంది. మాంసం, చేపలు, గింజలు, పప్పులు వంటి ఆహారాల్లో ఇది లభిస్తుంది.క్రంచీ (కఠినమైన) ఆహారాలు కూడా దంతాలకు ఉపయోగకరం. క్యారెట్, ఆపిల్, కీరదోస వంటి పండ్లు, కూరగాయలు నమిలేటప్పుడు సహజంగా దంతాలను శుభ్రపరుస్తాయి. ఇవి లాలాజలం ఉత్పత్తిని పెంచి, నోటిలోని బాక్టీరియాను తగ్గిస్తాయి.
0
0
0
0
0
0
0